రోమా 14:1-23

రోమా 14:1-23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వివాదస్పదమైన అంశాలపై వాదాలను పెట్టుకోవద్దు, కాని విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని అంగీకరించండి. ఒకని విశ్వాసం దేనినైనా తినడానికి అంగీకరిస్తుంది కాని, బలహీనమైన విశ్వాసం కలవారు కేవలం కూరగాయలనే తింటారు. అన్నిటిని తినేవారు అలా తినని వారిని తిరస్కరించకూడదు, అదే విధంగా అన్నిటిని తిననివారు తినేవారిని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించాడు. మరొకరి సేవకుడికి తీర్పు తీర్చడానికి నీవు ఎవరు? ఆ సేవకుడు నిలిచివుండాలన్నా లేక పడిపోవాలన్నా అది అతని సొంత యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కనుక వారు నిలబడతారు. ఒకరు ఒక రోజు మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు, మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సులలో దానిని పూర్తిగా నమ్ముతారు. ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కనుక వారు ప్రభువు కొరకే తింటున్నారు. ఆ విధంగా చేయనివారు కూడా ప్రభువు కొరకే చేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. మనలో ఎవరు కేవలం తన కొరకు మాత్రమే జీవించరు, తన కొరకు మాత్రమే మరణించరు. మనం జీవిస్తే అది ప్రభువు కొరకే జీవిస్తాము, మరణిస్తే అది ప్రభువు కొరకే మరణిస్తాం, కనుక మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారం అవుతాము. ఈ కారణంగానే, క్రీస్తు తాను మరణించినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి ఆయన మరణించి తిరిగి సజీవంగా లేచారు. అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం యెదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? దీని కొరకు లేఖనంలో, “ప్రభువు ఇలాచెప్తున్నాడు, ‘నేను జీవించినంత ఖచ్చితంగా, ప్రతి మోకాలు నా యెదుట వంగును, ప్రతి నాలుక దేవుని అంగీకరించును,’ ” అని వ్రాయబడి ఉంది. కనుక, మనలో ప్రతి ఒక్కరం మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మానేద్దాం. దానికి బదులు, సహోదరి లేదా సహోదరుని మార్గంలో ఆటంకంగా ఉండకుండా మీ మనస్సును సిద్ధపరచుకోండి. యేసు ప్రభువులో అంగీకరించబడిన వాటిలో అపవిత్రమైనది ఏదీ లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాని ఎవరైనా ఒక దానిని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. నీవు తినే దానిని బట్టి నీ సహోదరి లేదా సహోదరుడు దుఃఖపడితే, నీవు ప్రేమ చూపడం లేదన్నట్టు. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని నీవు తినే దానిని బట్టి నాశనం చేయకు. కనుక నీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. దేవుని రాజ్యం తిని త్రాగే వాటికి సంబంధించింది కాదు గాని, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందానికి సంబంధించింది. కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు. కాబట్టి ఏది మనల్ని సమాధానం వైపు, పరస్పర వృద్ధి వైపుకు నడిపిస్తుందో దాన్ని మనం చేద్దాం. ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని మరొకరికి ఆటంకాన్ని కలిగించేది తినేవానికి అది తప్పవుతుంది. మాంసం తినకపోవడం గాని మద్యం త్రాగకపోవడం గాని మీ సహోదరులు లేక సహోదరీలు పడిపోయేలా చేసే ఏదైనా చేయకపోవడమే మంచిది. వీటి గురించి మీకు గల నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి శిక్ష పొందనివారు దీవించబడినవారు. అయితే సందేహంతో తినేవారు విశ్వాసం కలిగి తినలేదు కనుక శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిది పాపమే అవుతుంది.

షేర్ చేయి
Read రోమా 14

రోమా 14:1-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు. ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి. ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు. మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు. మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం. చనిపోయిన వారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మళ్ళీ బతికింది? అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. “నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది. ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది. కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం. సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది. నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు. మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి. దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం. ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం. ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు. మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది. ఈ విషయాల్లో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు. అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.

షేర్ చేయి
Read రోమా 14

రోమా 14:1-23 పవిత్ర బైబిల్ (TERV)

సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి. ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు. అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా. ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు. ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి. ఒక రోజును ప్రత్యేకంగా భావించేవాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తిననివాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట. మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట. ఈ కారణంగానే మరణించిన వాళ్ళకు, జీవించే వాళ్ళకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు. ఇక ఇదిగో, నీవు నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెపుతున్నావు? మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్నచూపు చూస్తున్నారు? మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము. దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు, దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.” అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది. కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది. నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు. అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం. ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం. అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.

షేర్ చేయి
Read రోమా 14

రోమా 14:1-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుట మాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డైమెనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించు కొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినినయెడల విశ్వాసములేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.

షేర్ చేయి
Read రోమా 14

రోమా 14:1-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి. ఒకరేమో తన విశ్వాసాన్నిబట్టి అన్నీ తినవచ్చు అని నమ్ముతున్నారు, మరొకరు తన బలహీనమైన విశ్వాసాన్నిబట్టి కేవలం కూరగాయలే తింటున్నారు. అన్నిటిని తినేవారు అలా తినని వారిని చులకనగా చూడకూడదు, అలాగే అన్నిటిని తిననివారు తినేవారి మీద నింద వేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించారు. వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు. ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు. ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి వారు ప్రభువు కొరకే తింటున్నారు. తిననివారు కూడా ప్రభువు కొరకే తినడం మాని, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు. మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే, కాబట్టి మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారమే. ఈ కారణంగానే, చనిపోయినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేచారు. అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం ఎదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? దీని కోసం లేఖనంలో, “ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’” అని వ్రాయబడి ఉంది. కాబట్టి, మనలో ప్రతి ఒక్కరు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం. సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని యేసు ప్రభువులో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఎవరైనా ఒకదాన్ని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. మీరు తినే దాన్ని బట్టి మీ సహోదరి గాని సహోదరుడు గాని బాధపడితే, మీలో ప్రేమ లేదన్నట్టే. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని మీరు తినే దాన్ని బట్టి పాడు చేయకు. కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు. కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం. ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని ఒకరు తినేది మరొకరికి ఆటంకాన్ని కలిగిస్తే అది తప్పవుతుంది. మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది. వీటి గురించి మీకున్న నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి తనకు తాను తీర్పు తీర్చుకొననివారు దీవించబడినవారు. అయితే సందేహంతో తినేవారు విశ్వాసం లేకుండా తింటారు కాబట్టి శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ పాపమే అవుతుంది.

షేర్ చేయి
Read రోమా 14