రోమా 13:8-14

రోమా 13:8-14 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కనుక ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో మాత్రమే రుణపడి ఉండాలి తప్ప, మరి దేనిలో ఎవరికి అప్పు ఉండవద్దు. “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు నరహత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, మీరు ఆశించకూడదు” అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికి అవన్ని “మిమ్మల్ని మీరు ప్రేమించుకొన్నట్లే మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగు వారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నేరవేర్చడమే. ప్రస్తుత సమయాన్ని గ్రహించు: మీరు నిద్రమత్తు నుండి మేల్కోవలసిన సమయం వచ్చేసింది, ఎందుకంటే మనం మొదట్లో విశ్వసించినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది. రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కనుక మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాం. అతి త్రాగుడు మత్తు, లైంగిక అనైతికత వ్యభిచారం, కలహాలు, ఓర్వలేనితనం మొదలైన వాటిని విడిచి, పగటివేళలో వలె మనం మర్యాదగా ప్రవర్తిద్దాం. అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.

షేర్ చేయి
Read రోమా 13

రోమా 13:8-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం. పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం. చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

షేర్ చేయి
Read రోమా 13

రోమా 13:8-14 పవిత్ర బైబిల్ (TERV)

తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు” అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది. యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.

షేర్ చేయి
Read రోమా 13

రోమా 13:8-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకారక్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము. అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచనచేసికొనకుడి.

షేర్ చేయి
Read రోమా 13

రోమా 13:8-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి దేనిలో ఎవరికి రుణపడి ఉండవద్దు. “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు” అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగువారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. ప్రస్తుత సమయాన్ని తెలుసుకుని మీరు నిద్రమత్తు నుండి మేల్కోవలసిన సమయం వచ్చిందని గ్రహించండి. ఎందుకంటే మనం మొదట్లో నమ్మినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది. రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము. అతి త్రాగి మత్తులు కావడం, హద్దు అదుపు లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వ్యభిచారం చేయడం, గొడవపడడం, అసూయపడడం మొదలైన వాటిని విడిచి, పగటివేళ నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. మీరు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించకండి.

షేర్ చేయి
Read రోమా 13