రోమా 12:1-16

రోమా 12:1-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో ప్రతి ఒక్కరికి పంచియిచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. ఎలాగైతే మనలో ప్రతి ఒకరు వేరు వేరు పనులు చేసే అనేక అవయవాలతో ఒకే శరీరం కలిగి ఉన్నామో, అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగివున్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు. ఆ కృపావరం ధైర్యపరచడమైతే ధైర్యపరచు. ఆ కృపావరం దానం చేయడమైతే ధారళంగా దానం చేయి, ఆ కృపావరం ఇతరులను నడిపించడమైతే జాగ్రత్తగా నడిపించు, ఆ కృపావరం కనికరం చూపించడమైతే, దాన్ని సంతోషంగా చేయి. ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. దుష్టమైన దానిని ద్వేషించి మంచిదైన దానిని పట్టుకోవాలి. ప్రేమలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి. అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి. నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి. అవసరంలో ఉన్న ప్రభువు ప్రజలకు సహాయం చేయండి. ఆతిథ్యం ఇవ్వండి. మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. ఆనందించేవారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం కలిగి ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం కలిగి ఉండవద్దు.

షేర్ చేయి
Read రోమా 12

రోమా 12:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి. ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము. దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి. మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు. సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి. ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.

షేర్ చేయి
Read రోమా 12

రోమా 12:1-16 పవిత్ర బైబిల్ (TERV)

అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు! దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది. దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి. ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి. మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.

షేర్ చేయి
Read రోమా 12

రోమా 12:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవా డగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొన వద్దు.

షేర్ చేయి
Read రోమా 12

రోమా 12:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. ఎలాగైతే మనకు ఉన్న ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నా అవన్నీ ఒకే పని ఎలా చేయవో, అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. మనలో అందరికి అనుగ్రహించబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు; ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి. ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి. ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి. అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి. నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి. అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి. మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు.

షేర్ చేయి
Read రోమా 12

రోమా 12:1-16

రోమా 12:1-16 TELUBSIరోమా 12:1-16 TELUBSIరోమా 12:1-16 TELUBSIరోమా 12:1-16 TELUBSIరోమా 12:1-16 TELUBSIరోమా 12:1-16 TELUBSIరోమా 12:1-16 TELUBSI