ప్రకటన 21:9-16
ప్రకటన 21:9-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకొన్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక గొప్ప ఎత్తెన పర్వతం మీదికి తీసుకెళ్ళి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు. అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా స్వచ్ఛముగా మెరుస్తుంది. ఆ పట్టణానికి గొప్ప ఎత్తెన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి. మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి. పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి. నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలతకర్ర ఉంది. ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలతకర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల పొడవు ఉంది దాని పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి.
ప్రకటన 21:9-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు. ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు. యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది. ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి. తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి. ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి. నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది. ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
ప్రకటన 21:9-16 పవిత్ర బైబిల్ (TERV)
ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు. అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి. నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు ఉన్నట్లు కనుగొన్నాడు.
ప్రకటన 21:9-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి–ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మ వశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను. దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
ప్రకటన 21:9-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకున్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకెళ్లి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు. అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా మెరుస్తుంది. ఆ పట్టణానికి గొప్ప ఎత్తైన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి. మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి. పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండుమంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి. నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో ఆ పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలిచే కర్ర ఉంది. ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలిచే కర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల పొడవు ఉంది; దాని వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి.