ప్రకటన 21:6-27
ప్రకటన 21:6-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన నాతో, “సమాప్తమైనది. ఆల్ఫా, ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించువారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు. అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు. చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకొన్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక గొప్ప ఎత్తెన పర్వతం మీదికి తీసుకెళ్ళి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు. అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా స్వచ్ఛముగా మెరుస్తుంది. ఆ పట్టణానికి గొప్ప ఎత్తెన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి. మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి. పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి. నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలతకర్ర ఉంది. ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలతకర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల పొడవు ఉంది దాని పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి. అతడు దాని గోడలను కొలిచినప్పుడు మనుష్యుల కొలత ప్రకారం అది 144 మూరల మందం ఉంది. ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛముగా ఉంది. ఆ పట్టణపు గోడ యొక్క పునాదులు అమూల్యమైన వివిధ రత్నాలతో అలంకరించబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి. పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛముగా ఉంది. ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు. ఆ పట్టణంపై సూర్యుడు కాని చంద్రుడు కాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపం. ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు. ఏ రోజూ దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు. దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అయితే అపవిత్రమైనది కాని అసహ్యకరమైన, మోసకరమైన వాటిని చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు.
ప్రకటన 21:6-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం. అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు. ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు. యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది. ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి. తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి. ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి. నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది. ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే. తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే. ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది. ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ, అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగం. దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం. అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు. ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం. వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు. రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు. వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు. పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
ప్రకటన 21:6-27 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు. ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు. అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి. నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు ఉన్నట్లు కనుగొన్నాడు. ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు ఉన్నట్లు కనుగొన్నాడు. ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది. ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు. జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
ప్రకటన 21:6-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు ఆయన నాతో ఇట్లనెను–సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి–ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మ వశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను. దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువు ను గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. ఆ పట్టణములో ప్రకా శించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు. గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
ప్రకటన 21:6-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించేవారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు. అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు. చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకున్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకెళ్లి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు. అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా మెరుస్తుంది. ఆ పట్టణానికి గొప్ప ఎత్తైన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి. మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి. పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండుమంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి. నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో ఆ పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలిచే కర్ర ఉంది. ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలిచే కర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల పొడవు ఉంది; దాని వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి. అతడు దాని గోడలను కొలిచినప్పుడు మనుష్యుల కొలత ప్రకారం అది 144 మూరల మందం ఉంది. ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛంగా ఉంది. ఆ పట్టణపు గోడ పునాదులు అమూల్యమైన వివిధ రత్నాలతో అలంకరించబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి. పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛంగా ఉంది. ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు. ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము. ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు. ఏ రోజు దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు. దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అపవిత్రమైనవి అసహ్యకరమైనవి మోసకరమైనవి చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు.