ప్రకటన 21:1-8

ప్రకటన 21:1-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని” చూసాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది. అప్పుడు తన భర్త కొరకు అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూసాను. అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తాడు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటాడు. ‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తాడు. పాత క్రమం గతించిపోయింది కనుక అక్కడ చావు ఉండదు, దుఃఖం కాని ఏడ్పు కాని బాధ కాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను. అప్పుడు సింహాసనం మీద కూర్చునివున్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కనుక వీటిని వ్రాసి పెట్టు” అన్నాడు. ఆయన నాతో, “సమాప్తమైనది. ఆల్ఫా, ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించువారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు. అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు.

షేర్ చేయి
Read ప్రకటన 21

ప్రకటన 21:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను. అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను. అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు. ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

షేర్ చేయి
Read ప్రకటన 21

ప్రకటన 21:1-8 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది. సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది. సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు. ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.

షేర్ చేయి
Read ప్రకటన 21

ప్రకటన 21:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను–సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడైయుండును. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

షేర్ చేయి
Read ప్రకటన 21

ప్రకటన 21:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని” చూశాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది. అప్పుడు తన భర్త కోసం అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను. అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తారు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటారు. ‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు. మొదటి సంగతులు గతించి పోయాయి కాబట్టి అక్కడ చావు ఉండదు, దుఃఖం గాని ఏడ్పు గాని బాధ గాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను. అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కాబట్టి వీటిని వ్రాసి పెట్టు” అన్నారు. ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. జయించేవారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు. అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.

షేర్ చేయి
Read ప్రకటన 21