ప్రకటన 19:1-7
ప్రకటన 19:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఈ సంగతుల తర్వాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను: “హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే! ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి. భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన, ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించారు. తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగతీర్చుకున్నారు.” మరొకసారి వారు ఇలా బిగ్గరగా కేకలు వేశారు: “హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!” అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: “ఆమేన్! హల్లెలూయా!” అంటూ ఆరాధించారు. అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం, “దేవునికి భయపడేవారలారా, ఓ దేవుని సేవకులారా! చిన్నవారైన పెద్దవారైన అందరు మన దేవుని స్తుతించండి” అని పలికింది. అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నారు. కాబట్టి మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో ఆయనను కీర్తించుదాం! ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల పెళ్ళి రోజు వచ్చేసింది ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకుంది.
ప్రకటన 19:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే. ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.” రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు. అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు. అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది. తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.” “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.”
ప్రకటన 19:1-7 పవిత్ర బైబిల్ (TERV)
ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది: “దేవుణ్ణి స్తుతించండి! రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే. ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు. తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన ఆ వేశ్యను ఆయన శిక్షించాడు. తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.” వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి! కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.” ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు: “ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!” అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది: “ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి. ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.” ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి. సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన దేవుడు మనల్ని పాలిస్తున్నాడు. మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం. గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది. ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
ప్రకటన 19:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుతరువాత బహుజనులశబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని– ప్రభువు ను స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతి దండన చేసెను; మరి రెండవసారి వారు– ప్రభువు ను స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి–ఆమేన్, ప్రభువు ను స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు–మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము–సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.