ప్రకటన 16:8-21

ప్రకటన 16:8-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నాలుగవ దేవదూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో ప్రజలను కాల్చడానికి సూర్యునికి అనుమతి ఇవ్వబడింది. ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయనను మహిమపరచలేదు. అయిదవ దేవదూత తన పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యమంతా చీకటి కమ్మింది. ప్రజలు ఆ వేదనను తట్టుకోలేక తమ నాలుకలను కొరుక్కున్నారు. వారికి కలిగిన వేదనకు, కురుపులకు వారు పరలోక దేవుని దూషించారు కానీ తాము చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడలేదు. ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది. తర్వాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి. అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి. “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!” ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి. ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది. అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపము. ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు. అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు. ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై అయిదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు.

ప్రకటన 16:8-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషులను తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది. మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు. అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు. అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి. అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి. “వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.” హీబ్రూ భాషలో ‘హర్ మెగిద్దోన్’ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు. ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది. ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది. ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.

ప్రకటన 16:8-21 పవిత్ర బైబిల్ (TERV)

నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు. ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు. ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి. “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.” ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి. ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.

ప్రకటన 16:8-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లువారు మారుమనస్సు పొందినవారుకారు. అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగముయొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి; తమకు కలిగిన వేదనలనుబట్టియు పుండ్లనుబట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను. మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి, హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతు రేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా–సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.