ప్రకటన 14:1-13
ప్రకటన 14:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ తర్వాత నా ఎదుట సీయోను పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూశాను. అప్పుడు నేను పరలోకం నుండి ప్రవాహ జలాల ధ్వనిలా, గొప్ప ఉరుములా ఒక శబ్దాన్ని విన్నాను. అది నాకు వీణ వాయిద్యకారులు తమ వాయిద్యాలను వాయిస్తున్న ధ్వనిలా వినిపించింది. వారు సింహాసనం ముందు, నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచన పొందిన ఈ 1,44,000 మంది తప్ప ఆ పాటను ఎవరు నేర్చుకోలేరు. వీరు ఏ స్త్రీతో తమను అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు. వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు. ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను. అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు. రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’ అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు. మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేదా చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే, వారు ఏమి కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని త్రాగుతారు. పవిత్ర దేవదూతల ఎదుట వధించబడిన గొర్రెపిల్ల సన్నిధిలో అగ్ని గంధకంతో బాధించబడతారు. ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేదా దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు. ఇది యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న దేవుని ప్రజలు సహనాన్ని చూపించాల్సిన సమయం. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.
ప్రకటన 14:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి. అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది. వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు. వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు. అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు. అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు. వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు. తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. “ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి. వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు. దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి.” అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.
ప్రకటన 14:1-13 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొఱ్ఱెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది. పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆ ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ పాట నేర్చుకోరు. వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించేవాళ్ళు. వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొఱ్ఱెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు. వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు. ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది. అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు. రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు. మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి, దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద గాని వేయించుకొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు. ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి. ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్ళు ధన్యులు” అని అన్నది. “అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
ప్రకటన 14:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడి కెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. వీరినోట ఏ అబద్ధమును కనబడ లేదు; వీరు అనింద్యులు. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు–మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి–మోహోద్రేకముతోకూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను– ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవ డైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధదూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడలవాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
ప్రకటన 14:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)