ప్రకటన 13:11-18
ప్రకటన 13:11-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దాని తర్వాత రెండవ మృగం భూమిలో నుండి రావడం నేను చూశాను. దానికి గొర్రెపిల్లను పోలిన రెండు కొమ్ములు ఉన్నాయి, కాని అది ఘటసర్పంలా మాట్లాడింది. ఆ రెండవ మృగం మొదటి మృగానికి ఉన్న అధికారమంతటిని చెలాయిస్తూ, చనిపోయేంత గాయం నుండి స్వస్థపడిన ఆ మొదటి మృగాన్ని భూమి దాని నివాసులు ఆరాధించేలా చేసింది. అది గొప్ప సూచనలు చేస్తూ, మనుష్యులు చూస్తున్నప్పుడే ఆకాశం నుండి భూమి మీద అగ్నిని కురిసేలా చేస్తుంది. రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దాని కోసం అద్భుతాలను చేస్తూ భూనివాసులందరినీ మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బ్రతికిన ఆ మొదటి మృగం కోసం విగ్రహం చేయమని వారిని ఆదేశించింది. అంతేకాక మొదటి మృగం యొక్క విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికి, తద్వారా ఆ విగ్రహాన్ని పూజించని వారందరిని చంపించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది. దానిలో జ్ఞానం ఉంది. పరిజ్ఞానం కలవాడు ఆ మృగపు సంఖ్యను లెక్కించి తెలుసుకొనును గాక! అది ఒక మానవుని సంఖ్య. ఆ సంఖ్య 666.
ప్రకటన 13:11-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు. వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు. పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు. ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం. ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.
ప్రకటన 13:11-18 పవిత్ర బైబిల్ (TERV)
తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది. అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది. అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది. మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది. మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది. అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది. ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.
ప్రకటన 13:11-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడు చుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరి ద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారములేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.