ప్రకటన 13:1-4

ప్రకటన 13:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ ఘటసర్పం సముద్రపు ఒడ్డున నిలబడింది. ఇంతలో సముద్రంలో నుండి ఒక మృగం బయటకు రావడం నేను చూశాను. దానికి ఏడు తలలు పది కొమ్ములు, దాని కొమ్ములకు పది కిరీటాలు, దాని ప్రతి తలమీద దైవదూషణ చేసే పేరు ఉంది. నేను చూసిన ఆ మృగం చిరుతపులిని పోలి ఉంది, కాని దాని కాళ్లు ఎలుగుబంటి కాళ్లలా, దాని నోరు సింహం నోరులా ఉన్నాయి. ఆ ఘటసర్పం తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మృగానికి ఇచ్చింది. ఆ మృగం తలల్లో ఒకదానికి చనిపోయేంతగా గాయం తగిలినట్లు ఉన్నది కానీ ఆ గాయం పూర్తిగా మానిపోయింది. అందుకు భూలోక ప్రజలంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని వెంబడించారు. ఘటసర్పం ఆ మృగానికి అధికారం ఇచ్చింది కాబట్టి ప్రజలు దాన్ని పూజించారు. వారు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వంటివారు ఎవరు? ఈ మృగంతో యుద్ధం చేసి గెలవగలవారు ఎవరు?” అని చెప్పుకున్నారు.

ప్రకటన 13:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి. నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట పడి వెళ్ళారు. ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. “ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?” అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.

ప్రకటన 13:1-4 పవిత్ర బైబిల్ (TERV)

సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవదూషణ పేరు వ్రాయబడి ఉంది. నేను చూసిన ఆ మృగం ఒక చిరుతపులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది. ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది. ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వలె ఎవరున్నారు? ఈ మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు?” అని అన్నారు.

ప్రకటన 13:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు పది కొమ్ములును ఏడు తలలునుగల యొక. క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందునవారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు–ఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.