ప్రకటన 12:1-5
ప్రకటన 12:1-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్ళ క్రింద చంద్రుని, తన తల మీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది. ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి, దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకొని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.” ఆ శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకొనిపోబడ్డాడు.
ప్రకటన 12:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి. వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.
ప్రకటన 12:1-5 పవిత్ర బైబిల్ (TERV)
పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది. అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది. ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు.
ప్రకటన 12:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవభాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననై యున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయ వలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
ప్రకటన 12:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది. ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకుని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.” ఆ శిశువు దేవుని దగ్గరకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకుపోబడ్డాడు.