ప్రకటన 12:1-11

ప్రకటన 12:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది. ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకుని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.” ఆ శిశువు దేవుని దగ్గరకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకుపోబడ్డాడు. ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కోసం అరణ్యంలో సిద్ధం చేసిన స్థలానికి ఆమె పారిపోయింది. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి. కాని వానికి తగినంత బలం లేకపోవడంతో గెలువలేక పరలోకంలో తమ స్థానాన్ని పోగొట్టుకొన్నారు. ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయలేదు తమ ప్రాణాలను ప్రేమించలేదు.

ప్రకటన 12:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి. వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు. ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1, 260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు. అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.

ప్రకటన 12:1-11 పవిత్ర బైబిల్ (TERV)

పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది. అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది. ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు. పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు. పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు.

ప్రకటన 12:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవభాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననై యున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగివేయ వలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితోకూడ పడ ద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని–రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపు వాడైన అపవాది1 పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణమువరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.

ప్రకటన 12:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)