ప్రకటన 10:1-11

ప్రకటన 10:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి. అతడు తెరిచి ఉన్న ఒక చిన్న గ్రంథపుచుట్టను తన చేతిలో పట్టుకుని తన కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద పెట్టి, సింహగర్జన వంటి పెద్ద కేక వేశాడు. అతడు కేక వేసినప్పుడు ఏడు ఉరుములు తిరిగి గర్జించాయి. ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాయబోయాను; కానీ పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేసి వాటిని రహస్యంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను. అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని ఆకాశం వైపు ఎత్తాడు. ఆ తర్వాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని, భూమిని దానిలో ఉన్నవాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు! కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు. అప్పుడు పరలోకం నుండి నాతో మాట్లాడిన స్వరం మళ్ళీ నాతో, “వెళ్లు, సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దేవదూత చేతిలో తెరిచి ఉన్న ఆ చిన్న గ్రంథపుచుట్టను తీసుకో” అని చెప్పడం విన్నాను. కాబట్టి నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న గ్రంథపుచుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకుని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది” అని చెప్పాడు. అప్పుడు నేను ఆ చిన్న గ్రంథపుచుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకుని తినగా అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపులో చేదుగా మారింది. అప్పుడు ఆయన నాతో, “నీవు అనేక ప్రజలు, దేశాలు, రాజులు, వివిధ భాషలు మాట్లాడేవారి గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.

ప్రకటన 10:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్ర ధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రంపైనా ఎడమకాలు భూమిపైనా ఉంచాడు. తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి. ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తరువాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి “ఏడు ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు” అంటూ నాకొక స్వరం వినిపించింది. అప్పుడు సముద్రంమీదా భూమిమీదా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు. ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.” అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్లీ, “సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో” అని నాకు చెప్పాడు. నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన, “ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది” అన్నాడు. అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది. అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”

ప్రకటన 10:1-11 పవిత్ర బైబిల్ (TERV)

శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద, ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయన అలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి. ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది. సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు. చిరకాలం జీవించేవాని మీద, పరలోకం, అందులో ఉన్నవాటిని సృష్టించినవాని మీద, భూమిని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టంచినవానిమీద, సముద్రాన్ని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు. కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు. నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది. అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, “ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు. నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను. ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలమంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.

ప్రకటన 10:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద మేఘధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను. ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా–ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి –పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని–ఇక ఆలస్యముండదు గాని యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు–నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్లి–ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన– దాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు–నీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆయా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేక మంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.