ప్రకటన 1:9-20
ప్రకటన 1:9-20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కొరకు, యేసు సాక్ష్యం కొరకు పత్మాసు ద్వీపంలో బంధీగా ఉన్నాను. ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై యున్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను. నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి చుట్టూ తిరిగాను. నేనలా తిరిగినప్పుడు అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూసాను. ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ళ అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకొని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూసాను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు మండుతున్న అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న కంచులా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొన్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటి వాడను చివరి వాడను. జీవించు వాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడు, ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా అధికారంలోనే ఉన్నాయి. “కనుక నీవు చూసినవాటిని, ఇప్పుడు ఉన్నవాటిని, వాటి తరువాత జరుగబోయే వాటిని వ్రాసి పెట్టు. నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు.
ప్రకటన 1:9-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ సోదరుణ్నీ, యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను. ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను. అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది. ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది. నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే. జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూసిన సంగతులనూ ప్రస్తుతమున్న సంగతులనూ, వీటి తరువాత జరగబోయే సంగతులనూ రాయి. నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు. ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
ప్రకటన 1:9-20 పవిత్ర బైబిల్ (TERV)
నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది. నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
ప్రకటన 1:9-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను – భయపడకుము; నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.
ప్రకటన 1:9-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాను. ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను. నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి వెనుకకు తిరిగాను. నేను అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ల అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూశాను. ఆయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు మండుతున్న అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న ఇత్తడిలా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటివాడను చివరివాడను. జీవించేవాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడూ ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా ఆధీనంలోనే ఉన్నాయి. “కాబట్టి నీవు చూసినవాటిని, ఇప్పుడు ఉన్నవాటిని, వాటి తర్వాత జరుగబోయే వాటిని వ్రాసి పెట్టు. నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు.