ప్రకటన 1:1-18
ప్రకటన 1:1-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు కనుపరచడానికి యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేసారు. అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు. సమయం సమీపంగా ఉంది కనుక ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు. యోహాను, ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు వ్రాయునది: ఉన్నవాడు, ఉండినవాడు, రానున్న వాడు, దేవుని సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షిగా, మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి, భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక! ఆయనే మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి, తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక! ఆమేన్. “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు.” “ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు “ఆయనను చూసి బిగ్గరగా విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్. “ఉన్న వాడు, ఉండినవాడు, రానున్నవాడైన సర్వశక్తిగల ప్రభువైన దేవుడు” చెప్తున్నారు, “ఆల్ఫాను, ఒమేగాను నేనే” అని. యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కొరకు, యేసు సాక్ష్యం కొరకు పత్మాసు ద్వీపంలో బంధీగా ఉన్నాను. ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై యున్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను. నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి చుట్టూ తిరిగాను. నేనలా తిరిగినప్పుడు అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూసాను. ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ళ అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకొని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూసాను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు మండుతున్న అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న కంచులా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొన్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటి వాడను చివరి వాడను. జీవించు వాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడు, ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా అధికారంలోనే ఉన్నాయి.
ప్రకటన 1:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు. యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్షాన్ని గురించీ తాను చూసినదానంతటికీ సాక్షిగా ఉన్నాడు. ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది. ఆసియలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండీ, ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండీ, నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు. మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తి యశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక! చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు. “ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు. మీ సోదరుణ్నీ, యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను. ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను. అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది. ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది. నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే. జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.
ప్రకటన 1:1-18 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది. యోహాను నుండి, ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు, భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక! ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్. చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును నేనే” అని అన్నాడు. నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది. నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి.
ప్రకటన 1:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యుసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్. అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను – భయపడకుము; నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
ప్రకటన 1:1-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు. అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు. సమయం సమీపంగా ఉంది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు. యోహాను, ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు వ్రాయునది: గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు రానున్నవాడైన దేవుని సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి, తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్. “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్. “అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు. యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాను. ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను. నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి వెనుకకు తిరిగాను. నేను అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ల అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూశాను. ఆయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు మండుతున్న అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న ఇత్తడిలా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటివాడను చివరివాడను. జీవించేవాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడూ ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా ఆధీనంలోనే ఉన్నాయి.