కీర్తనలు 96:1-13
కీర్తనలు 96:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి; సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి. యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి. దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి. యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు. ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృజించారు. వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి. ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి. యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి. “యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు; ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు. ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి. ఆయన మహిమను ప్రచురించాలి. పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి. అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి. యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.
కీర్తనలు 96:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి. యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి. రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి. యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి. జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా. ఘనతాప్రభావాలు ఆయన ముందున్నాయి. బలం, సౌందర్యం ఆయన పవిత్ర ఆలయంలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ యెహోవాకు చెల్లించండి. మహిమ, బలం యెహోవాకు చెల్లించండి. యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి. పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి. యెహోవా పరిపాలిస్తున్నాడు. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన ప్రజలకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని రాజ్యాల్లో చెప్పండి. యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక. మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక. అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
కీర్తనలు 96:1-13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి! సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక! యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి. శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి. దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి. దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి. యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు. ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే. కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు. ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి. వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు స్తుతి కీర్తనలు పాడండి. యెహోవా నామాన్ని స్తుతించండి. మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి. యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి! భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి. యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! కనుక ప్రపంచం నాశనం చేయబడదు. యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు. ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము! సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము! పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి! అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి. యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి. ప్రపంచాన్ని పాలించుటకు యెహోవా వస్తున్నాడు. న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
కీర్తనలు 96:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతిం చుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.