కీర్తనలు 84:1-12
కీర్తనలు 84:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవామందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులువారు నిత్యము నిన్ను స్తుతించుదురు. (సెలా.) నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవియొగ్గుము. (సెలా.) దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.
కీర్తనలు 84:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం! యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది. సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది. నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. సెలా ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు. వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది. వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు. యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. సెలా. దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు. నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం. యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు. సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.
కీర్తనలు 84:1-12 పవిత్ర బైబిల్ (TERV)
సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది. యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను. నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను. నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది. సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా, పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి. ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి. అక్కడే వాటి పిల్లలు ఉంటాయి. నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు. ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు. వారు నిన్నే నడిపించ నిస్తారు. దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు. వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు. సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే యాకోబు దేవా, నా మాట వినుము. దేవా, మా సంరక్షకుని కాపాడుము. నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము. దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు. దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు. యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
కీర్తనలు 84:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో! యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి. సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా, మీ బలిపీఠం దగ్గరే, పిచ్చుకలకు నివాసం దొరికింది, వాన కోయిలకు గూడు దొరికింది, అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది. మీ మందిరంలో నివసించేవారు ధన్యులు; వారు నిత్యం మిమ్మల్ని స్తుతిస్తారు. సెలా మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు, వారి హృదయాలు సీయోనుకు వెళ్లే రహదారుల మీదే ఉంటాయి. వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు, వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు; తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో కప్పివేస్తుంది. వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు వారి బలం అధికమవుతుంది. సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి; యాకోబు దేవా, ఆలకించండి. సెలా మా డాలువైన ఓ దేవా! మా వైపు చూడండి; మీ అభిషిక్తునిపై దయ చూపండి. బయట గడిపిన వెయ్యి దినాలకంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము. యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు. సైన్యాల యెహోవా, మీయందు నమ్మకముంచే మనుష్యులు ధన్యులు.