కీర్తనలు 78:1-25

కీర్తనలు 78:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్య ములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లునువారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమపితరులవలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయువారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ మించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెననివారికాజ్ఞాపించెను విండ్లను పట్టుకొని యుద్ధసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచువారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

షేర్ చేయి
Read కీర్తనలు 78

కీర్తనలు 78:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి. నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను. మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను. యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం. రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు. వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు. మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు. ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు. వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు. ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు. ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు. పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు. అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు. బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు. అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు. వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు. యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది. వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు. అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు. ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు. మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 78

కీర్తనలు 78:1-25 పవిత్ర బైబిల్ (TERV)

నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి. నేను చెప్పే విషయాలు వినండి. ఈ కథ మీతో చెబుతాను. ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను. ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు. మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు. ఈ కథను మనము మరచిపోము. మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు. మనమంతా యెహోవాను స్తుతిద్దాము. ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము. యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు. మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు. ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు. క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు. కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు. దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు. వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు. ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే, అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు. వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు. ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు. ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు కలిగి ఉన్నారు. కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు. వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపుకోలేదు. దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు. ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు. ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు. ఈజిప్టులోను, సోయను వద్దను దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు. వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి. ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు. అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు. భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు. బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు. అది ఒక నదిలా ఉంది. కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు. అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు. అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు. కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు. వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. “ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా? దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది. తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు. ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు. యాకోబు మీద దేవునికి చాలా కోపం వచ్చింది. ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది. ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు. దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు. కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు. వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు. అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది. ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు. ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 78

కీర్తనలు 78:1-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నా ప్రజలారా! నా ఉపదేశం వినండి; నా నోటి మాటలు వినండి. నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను; పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను. మనం విన్నవి మనకు తెలిసినవి మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను. వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము; యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి తర్వాతి తరానికి మేము చెప్తాం. ఆయన యాకోబుకు చట్టాలు విధించారు ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు, వారి పిల్లలకు దానిని బోధించుమని మన పూర్వికులకు ఆజ్ఞాపించారు. తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు, ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు, వారు వారి పిల్లలకు బోధిస్తారు. అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు ఆయన కార్యాలను మరచిపోరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. వారు తమ పితరుల్లా అనగా మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను, దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు. ఎఫ్రాయిం వారు విల్లులను ఆయుధాలుగా ధరించినప్పటికీ, యుద్ధ దినాన వెనుకకు తిరిగారు; వారు దేవుని నిబంధనను పాటించలేదు, ఆయన న్యాయవిధుల ప్రకారం జీవించడానికి నిరాకరించారు. వారు ఆయన చేసిన కార్యాలు, ఆయన వారికి చూపిన అద్భుతాలను మరచిపోయారు. ఆయన వారి పూర్వికుల ఎదుట ఈజిప్టు దేశంలో, సోయను ప్రాంతంలో అద్భుతకార్యాలు చేశారు. ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు; ఆయన నీటిని గోడలా నిలబడేలా చేశారు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారికి దారి చూపారు. అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు. సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని ఇచ్చారు. ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు నీటిని నదుల్లా ప్రవహింపజేశారు. కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు. తాము ఆశపడిన ఆహారాన్ని అడుగుతూ వారు ఉద్దేశపూర్వకంగా దేవున్ని పరీక్షించారు. వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; వారు, “ఈ ఎడారిలో దేవుడు మనకు భోజనం సరఫరా చేయగలడా? నిజమే, ఆయన బండరాయిని కొట్టారు, నీరు బయటకు వచ్చింది, ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి, కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా? ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు. యెహోవా వారి మాట విని కోపగించారు; ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది, ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది. ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు. అయినా ఆయన పైనున్న ఆకాశాలను ఆకాశద్వారాలు తెరిచారు. తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు. పరలోకం నుండి ధాన్యం ఇచ్చారు. మానవులు దేవదూతల ఆహారం తిన్నారు; ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపారు.

షేర్ చేయి
Read కీర్తనలు 78