కీర్తనలు 77:1-20

కీర్తనలు 77:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను బిగ్గరగా దేవునికి మొరపెడతాను, నేను దేవుణ్ణి పిలుస్తాను, నా దేవుడు నా మాట వింటాడు. నా కష్ట సమయంలో నేను ప్రభువును వెతికాను. రాత్రంతా నేను నా చేతులెత్తి ప్రార్థించాను, నా ప్రాణం ఓదార్పు పొందడం లేదు. నా వేదనలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నాను, నీరసించిపోయి నేను ఆయన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. సెలా నువ్వు నా కళ్ళు తెరచి ఉంచుతున్నావు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను. గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను, ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ప్రభువు శాశ్వతంగా నన్ను తోసివేస్తాడా? ఆయన ఇంకెన్నటికీ మళ్ళీ నా మీద దయ చూపడా? ఆయన కృప ఎప్పటికీ రాదా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నేరవేరదా? దేవుడు కనికరించడం మరచిపోయాడా? ఆయన కోపం దయకు అడ్డుపడిందా? సెలా ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను. అయితే యెహోవా, గతంలోని నీ అద్భుత క్రియలను నేను గుర్తుకు తెచ్చుకుంటాను. నీ పనులన్నిటినీ నేను తలంచుకుంటాను. వాటిని మననం చేసుకుంటాను. దేవా! నీ మార్గం పవిత్రం. మన గొప్ప దేవునికి సాటి అయిన దేవుడెవరు? నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు. నీ గొప్ప బలంతో నీ ప్రజలకు-యాకోబు యోసేపుల సంతతికి విజయాన్నిచ్చావు. సెలా దేవా, నీళ్ళు నిన్ను చూశాయి, నీళ్ళు నిన్ను చూసి భయపడ్డాయి, అగాధంలోని నీళ్ళు వణికిపోయాయి. మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి. నీ ఉరుముల మోత సుడిగాలిలో మోగింది. మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికి కంపించింది. సముద్రంలో నీ దారి వెళ్ళింది. ప్రవాహాల్లోగుండా నీ దారి మళ్ళింది. అయితే నీ కాలిముద్రలు కనబడలేదు. మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.

షేర్ చేయి
Read కీర్తనలు 77

కీర్తనలు 77:1-20 పవిత్ర బైబిల్ (TERV)

సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను. దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము. నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను. నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది. నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు, నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను. నీవు నన్ను నిద్రపోనియ్యవు. నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను. గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను. చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను. నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను. “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా? ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా? దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా? ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా? కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా? ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా? అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను. యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను. దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను. ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను. దేవా, నీ మార్గాలు పవిత్రం. దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు. నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి. నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు. నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు. యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు. దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి. లోతైన జలాలు భయంతో కంపించాయి. దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి. ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి. అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి. పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి. మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది. భూమి కంపించి వణికింది. దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు. కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు. అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

షేర్ చేయి
Read కీర్తనలు 77

కీర్తనలు 77:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.) నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? (సెలా.) అందుకు–నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగినశ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు. నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను. మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను. మోషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.

షేర్ చేయి
Read కీర్తనలు 77

కీర్తనలు 77:1-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను. నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు. దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను. మునుపటి రోజులను గురించి, చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను. రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది: “ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా? ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా? ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా? దేవుడు కరుణించడం మరచిపోయారా? ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” సెలా అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు. యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.” దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు? మీరు అద్భుతాలు చేసే దేవుడు; మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు. మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన మీ ప్రజలను విమోచించారు. సెలా దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి, జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి; అగాధాలు వణికిపోయాయి. మేఘాలు వర్షించాయి. ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి. మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి. మీ ఉరుము సుడిగాలిలో వినిపించింది, మీ మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది; భూమి వణికి కంపించింది. మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ, మీ మార్గం సముద్రం గుండా, శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది. మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.

షేర్ చేయి
Read కీర్తనలు 77