కీర్తనలు 73:1-28
కీర్తనలు 73:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవువారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవివారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురువారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరునువారు జలపానము సమృద్ధిగా చేయుదురు. –దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. –ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును. అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయివారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావువారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు. నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.
కీర్తనలు 73:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు. నా పాదాలు కొద్దిలో జారిపోయేవి. నా అడుగులు దాదాపుగా జారి పోయాయి. భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను. మరణ సమయంలో కూడా వారికి యాతన అనిపించదు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు వచ్చే విపత్తులు వారికి రావు. కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు. వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి. వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు. కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు. దేవునికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో ఆయనకి అవగాహన ఉందా? అని వారనుకుంటారు. గమనించండి. వారు దుర్మార్గులు. మరింత డబ్బు సంపాదిస్తూ విచ్చలవిడిగా ఉంటారు. నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే. రోజంతా నాకు బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఉదయం నేను శిక్షకు గురవుతున్నాను. ఇలాటి మాటలు నేను చెబుతాను అని నేను అన్నట్టయితే నేను ఈ తరంలోని నీ పిల్లలను మోసం చేసినట్టే. అయినా దీన్ని గురించి ఆలోచించినప్పుడు అది నాకు చాలా కష్టసాధ్యం అనిపించింది. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను. నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు. ఒక్క క్షణంలో వారు అంతమైపోతారు. విపరీతమైన భయంతో నశించిపోతారు. నిద్ర మేలుకుని తన కల మరచిపోయినట్టు ప్రభూ, నువ్వు మేలుకుని వారి ఉనికి లేకుండా చేస్తావు. నా హృదయంలో దుఃఖం ఉంది. నా అంతరంగంలో నేను గాయపడ్డాను. అప్పుడు నేను తెలివి తక్కువగా ఆలోచించాను. నీ సన్నిధిలో మృగం వంటి వాడుగా ఉన్నాను. అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు. నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు. నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు. నీకు దూరంగా జరిగేవారు నశించిపోతారు. నీకు అపనమ్మకంగా ఉన్నవారందరినీ నువ్వు నాశనం చేస్తావు. నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.
కీర్తనలు 73:1-28 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు. పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు. నేను దాదాపుగా జారిపోయి, పాపం చేయటం మొదలు పెట్టాను. దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను. ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు. వారు జీవించుటకు శ్రమపడరు. మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు. ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు. కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు. వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం. ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు. వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు. ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు. వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు. ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు. వారు భూమిని పాలించేవారని తలుస్తారు. కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి వారు చెప్పే సంగతులు నమ్ముతారు. “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు. సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.” ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు. మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు. కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి? నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి? దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను. నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు. ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను. కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది. ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను. కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది. నేను దేవుని ఆలయానికి వెళ్లాను, వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను. దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు. వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం. కష్టం అకస్మాత్తుగా రావచ్చును. అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు. భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు. అప్పుడు వారు అంతమైపోతారు. యెహోవా, మేము మేల్కొన్నప్పుడు మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు. మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను నీవు కనబడకుండా చేస్తావు. నేను చాలా తెలివి తక్కువ వాడను. ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను. దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను. తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను. నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. దేవా, నీవు నా చేయి పట్టుకొనుము. దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము. ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు. దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు. మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి? ఒకవేళ నా మనస్సు, నా శరీరం నాశనం చేయబడతాయేమో. కాని నేను ప్రేమించే బండ నాకు ఉంది. నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు. దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు. నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు. కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను. దేవుడు నా యెడల దయ చూపించాడు. నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం. దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.
కీర్తనలు 73:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు. కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి; నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది. దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను. వారికి ఏ బాధలు లేవు; వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి. సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు; మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు. కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు. వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది, వారి చెడు ఊహలకు హద్దులు లేవు. వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు. వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి. అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు. “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు. దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు. నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే. రోజంతా నేను బాధింపబడ్డాను, ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి. నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, నేను మీ పిల్లలను మోసం చేసినట్టే. ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను. ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు. వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, వారు భయంతో పూర్తిగా నశిస్తారు! ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు. నా హృదయం దుఃఖించినప్పుడు నా ఆత్మ నీరసించినప్పుడు, నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను. అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను; మీరు నా కుడిచేయి పట్టుకున్నారు. మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు. పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు. నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం నిత్యం నా స్వాస్థ్యం. మీకు దూరంగా ఉన్నవారు నశిస్తారు; మిమ్మల్ని విడిచి వ్యభిచారులుగా ప్రవర్తించే వారందరినీ మీరు నాశనం చేస్తారు. కాని నా మట్టుకైతే, నేను దేవునికి సమీపంగా ఉంటాను. నేను ప్రభువైన యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాను; మీ క్రియలన్నిటిని గురించి నేను ప్రకటిస్తాను.