కీర్తనలు 51:1-9
కీర్తనలు 51:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి. నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు. నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది. నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు. ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను. ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు. నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను. నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు. నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.
కీర్తనలు 51:1-9 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము. దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము. నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను. తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే. నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు. అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము. హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము. నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము. నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము. నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి వేయుము.
కీర్తనలు 51:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.
కీర్తనలు 51:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి. నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి. నా అతిక్రమాలు నాకు తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది. కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది. నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని. మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు. హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను. నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి. నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి నా దోషమంతటిని తుడిచివేయండి.