కీర్తనలు 45:1-9

కీర్తనలు 45:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను రాజు కోసం వ్రాసిన పద్యాలు వల్లించేటప్పుడు, నా హృదయం ఓ మంచి అంశంతో ఉప్పొంగింది; నా నాలుక నైపుణ్యం కలిగిన రచయిత కలము. మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు మీ పెదవులపై దయ నిండి ఉంది, దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు. బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; వైభవం ప్రభావాలను ధరించుకోండి. సత్యం, వినయం, న్యాయం కోసం మీ వైభవంతో విజయవంతంగా ముందుకు సాగిపోండి. మీ కుడిచేయి భీకరమైన క్రియలు సాధించాలి. పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు. ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం. మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు. మీరు ధరించిన వస్త్రాలన్ని గోపరసం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. దంతం చేత అలంకరించబడిన భవనాలలో నుండి తంతి వాయిద్యాలు మోగుతూ ఉంటే మీకెంతో ఆనందము. ఘనత వహించిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు సువర్ణాభరణాలతో అలంకరించుకుని రాణి మీ కుడి ప్రక్కన నిలిచి ఉంది.

కీర్తనలు 45:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది. మనుషులందరి కంటే నువ్వు అందంగా ఉన్నావు. దయా కనికరాలు నీ పెదాలపై పోశారు. కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదించాడని మాకు తెలుస్తూ ఉంది. బలశాలీ, నీ నడుముకు కత్తిని ధరించు. నీ తేజస్సునూ నీ ప్రభావాన్నీ ధరించుకో. నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా నీ రాజసంతో వాహనంపై విజయోత్సవంతో బయల్దేరు. నీ కుడిచెయ్యి భయాన్ని పుట్టించే సంగతులను నీకు నేర్పుతుంది. నీ బాణాలు పదునైనవి. నీ ఎదుట ప్రజలు కూలిపోతారు. రాజు శత్రువు గుండెల్లో నీ బాణాలు గుచ్చుకుని ఉంటాయి. దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం. నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు. నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి. గౌరవనీయులైన నీ స్త్రీలలో రాజ కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు స్వర్ణాభరణాలు ధరించుకుని రాణి నీ కుడి వైపున నిలబడి ఉంది.

కీర్తనలు 45:1-9 పవిత్ర బైబిల్ (TERV)

రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి. నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి. నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు! నీ పెదవులనుండి దయ వెలువడుతుంది కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము. నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము. అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము. నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు. దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! నీ నీతి రాజదండము. నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు. కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా నీ దేవుడు కోరుకొన్నాడు. నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి. నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది. నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు. నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

కీర్తనలు 45:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది. నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు. నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.