కీర్తనలు 42:5-11

కీర్తనలు 42:5-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను. నా దేవా, నా హృదయం నాలో నిరుత్సాహంగా ఉంది. కాబట్టి యొర్దాను ప్రదేశం నుండీ హెర్మోను పర్వతం నుండీ మిసారు కొండ నుండీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలపాతాల ధ్వనికి అగాధం అగాధాన్ని పిలుస్తుంది. నీ అలలూ నీ కెరటాలూ నా పైగా ప్రవహిస్తున్నాయి. అయినా పగటివేళ యెహోవా తన నిబంధన కృప కలగాలని ఆజ్ఞాపిస్తాడు. రాత్రిపూట ఆయనను గూర్చిన గీతం నాతో ఉంటుంది. నా జీవానికి దేవుడైన యెహోవా ప్రార్థన నాతో ఉంటుంది. నా ఆశ్రయశిల అయిన దేవునితో ఇలా అంటాను. నువ్వు నన్నెందుకు మర్చిపోయావు? శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి? నీ దేవుడు ఏమయ్యాడని నా శత్రువులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే అది నా ఎముకల్లో బాకులాగా గుచ్చుకుంటుంది. నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళనపడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.

షేర్ చేయి
Read కీర్తనలు 42

కీర్తనలు 42:5-11 పవిత్ర బైబిల్ (TERV)

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను? ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు. నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను. కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను. నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది. నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి. ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు. అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఆశ్రయ బండ అయిన నా దేవునితో, “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను. నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు. “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు. నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయమా! నా దేవా!

షేర్ చేయి
Read కీర్తనలు 42

కీర్తనలు 42:5-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను. నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున–నీవేల నన్ను మరచియున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. –నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు.వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.

షేర్ చేయి
Read కీర్తనలు 42

కీర్తనలు 42:5-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను. నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ ప్రవాహాల గర్జనతో అగాధం అగాధాన్ని పిలుస్తుంది; మీ తరంగాలు అలలు నా మీదుగా పొర్లి పారుతున్నాయి. పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు, రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది. నా కొండ అయిన దేవునితో, “మీరు నన్నెందుకు మరచిపోయారు? శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను. రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

షేర్ చేయి
Read కీర్తనలు 42