కీర్తనలు 31:1-24
కీర్తనలు 31:1-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి. మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి. మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు. మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి. విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను. మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు. మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు. యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి. నా బ్రతుకు వేదనలో గడుస్తుంది నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా పాపాన్ని బట్టి నా బలమంతా హరించుకు పోతోంది, నా ఎముకల్లో సత్తువలేదు. నా శత్రువులందరి కారణంగా పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు. చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను. అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు. కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను. నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి. మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి. యెహోవా, నేను మీకు మొరపెట్టాను, నన్ను సిగ్గుపడనీయకండి; అయితే దుష్టులు అవమానపరచబడాలి వారు పాతాళంలో మౌనంగా ఉండాలి. అహంకారంతో ధిక్కారంతో గర్వంతో నీతిమంతులను దూషించే వారి అబద్ధపు పెదవులు మూయబడాలి. మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది! మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు. యెహోవాకు స్తుతి, ఎందుకంటే ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు. “మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు. యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు. యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి.
కీర్తనలు 31:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు. నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు. నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే. నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు. నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు. నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు. యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి. నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు. చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను. చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే. అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను. నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు. యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ. అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు. నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు. ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక. నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు. యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు. యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.
కీర్తనలు 31:1-24 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపరచవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము. దేవా, నా మాట ఆలకించుము. వేగంగా వచ్చి నన్ను రక్షించి నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము. నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము. దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము. నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం. యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. నన్ను రక్షించుము. వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను. దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. నా కష్టాలు నీవు చూశావు. నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు. నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు. యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము. నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి. నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి. నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది. నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి. నా బలం తొలగిపోతూ ఉంది. నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు. నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు. నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు. వారు నానుండి దూరంగా ఉంటారు. నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను. నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు. ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను. ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు. యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే నా దేవుడవు. నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము. నన్ను రక్షించుము. యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను. కనుక నేను నిరాశచెందను. చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు, మౌనంగా వారు సమాధికి వెళ్తారు. ఆ చెడ్డవాళ్లు గర్వించి, మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబుతారు. ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు. కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి. దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు. నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు. మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు. ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు. కాని ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు. యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు. ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు. నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను. కాని దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు. దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి. యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు. కాని తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు. యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.
కీర్తనలు 31:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస హ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను. నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని. అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారువారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను –నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందువారు మౌనులైయుందురు గాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక.వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచు చున్నావు ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక. భీతిచెందినవాడనై–నీకు కనబడకుండ నేను నాశన మైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతి కారము చేయును. యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.