కీర్తనలు 30:1-5

కీర్తనలు 30:1-5 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు. నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. నీవు నన్ను స్వస్థపరచావు. సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు. నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ ఉండవలసిన పనిలేదు. దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు. నాకు “జీవం” ప్రసాదించాడు. రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

కీర్తనలు 30:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమునుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.