కీర్తనలు 28:1-9

కీర్తనలు 28:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను. నా ఆధారశిలా, నన్ను నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను సమాధిలోకి దిగిపోయిన వాళ్ళలా అవుతాను. నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు. దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు. వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వు. వాళ్ళ చేతి పనిని బట్టి వాళ్లకు చెల్లించు. తగిన సమయంలో వాళ్ళకు ఇవ్వు. యెహోవా మార్గాలు, ఆయన చేతిపనులు వాళ్ళు అర్థం చేసుకోరు గనక ఆయన వాళ్ళను కూలదోసి, ఇంకెన్నడూ తిరిగి కట్టడు. యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక! యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను. యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం. నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.

షేర్ చేయి
Read కీర్తనలు 28

కీర్తనలు 28:1-9 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నీవే నా బండవు. సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు. సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను. యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. నా మీద దయ చూపించుము. యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము. ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం” అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు. కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము. ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము. యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు. ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు. వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు. యెహోవాను స్తుతించండి. కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు. యెహోవా నా బలం, ఆయనే నా డాలు. నేను ఆయనను నమ్ముకొన్నాను. ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను. యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు. దేవా, నీ ప్రజలను రక్షించుము. నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము. కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

షేర్ చేయి
Read కీర్తనలు 28

కీర్తనలు 28:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును. నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు నట్టు నన్ను లాగి వేయకుము.వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు దురు వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము.వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుమువారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుమువారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.

షేర్ చేయి
Read కీర్తనలు 28

కీర్తనలు 28:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను; మీరు నా కొండయై ఉన్నారు, నా మొరను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను. నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తి, కరుణ కొరకై నేను చేసే మొర సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి. దుష్టులతో, చెడు చేసేవారితో పాటు నన్ను లాక్కు వెళ్లకండి. వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని, వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు. వారి క్రియలకు వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి. చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి; వారికి తగిన ప్రతిఫలమివ్వండి. యెహోవా క్రియలను గాని ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు, కాబట్టి ఆయన వారిని పడగొడతారు మరలా వారిని నిలబెట్టరు. యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక. యెహోవాయే నా బలం నా డాలు; హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను. యెహోవాయే తన ప్రజలకు బలము. తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము. మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి; వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.

షేర్ చేయి
Read కీర్తనలు 28