కీర్తనలు 27:1-6
కీర్తనలు 27:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను? నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు. సైన్యం నన్ను ముట్టడించినా, నా హృదయం భయపడదు; నా మీదికి యుద్ధానికి వచ్చినా, నేను ధైర్యం కోల్పోను. యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను. ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు. నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే, నా తల పైకెత్తబడుతుంది ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను; నేను పాడి యెహోవాను స్తుతిస్తాను.
కీర్తనలు 27:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి? నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు. నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను. యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను. ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు. అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను.
కీర్తనలు 27:1-6 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక నేను ఎవరికి భయపడను. దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు. వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు. వారు నా శత్రువులు, విరోధులు. వారు కాలు తప్పి పడిపోదురు. అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను. యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను. యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.” నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు. నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను. యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
కీర్తనలు 27:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర ములో నివసింప గోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.

