కీర్తనలు 18:6-13
కీర్తనలు 18:6-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది. భూమి కంపించి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి; ఆయన కోపానికి అవి వణికాయి. ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి. ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు. ఆయన చీకటిని తన కప్పుగా, కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు. ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు, వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి. యెహోవా పరలోకం నుండి ఉరిమారు; మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
కీర్తనలు 18:6-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది. అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి. ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది. ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది. కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు. తన చుట్టూ అంధకారాన్ని, దట్టమైన వర్షమేఘాలను గుడారంగా చేశాడు. ఆయన ఎదుట మెరుపులు, వడగళ్ళు, మండుతున్న నిప్పులు కురిసాయి. యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.
కీర్తనలు 18:6-13 పవిత్ర బైబిల్ (TERV)
చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను. నేను నా దేవుణ్ణి ప్రార్థించాను. దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు. సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు. యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు. భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి. ఎందుకంటే ప్రభువు కోపించాడు. ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది. యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి. నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి. యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు. ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి. ఎగిరే కెరూబుల మీద ఆయన స్వారీ చేశాడు. ఆయన గాలుల మీద పైకెగిరాడు. యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మేఘంలో ఆయన మరుగైయున్నాడు. దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు. అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది. అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి. యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది. సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.
కీర్తనలు 18:6-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మి యుండెను. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.