కీర్తనలు 16:1-11
కీర్తనలు 16:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు. నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు. భూమి మీద ఉన్న భక్తుల విషయానికి వస్తే, వాళ్ళు శ్రేష్టులు. నా ఆనందం అంతా వాళ్ళే. యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను ఆశించే వాళ్లకు సమస్యలు ఎక్కువౌతాయి. వాళ్ళు అర్పించే రక్తపానీయ అర్పణలు నేను అర్పించను. నా పెదాలతో వాళ్ళ పేర్లు ఎత్తను. యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది. అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను! అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను. ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
కీర్తనలు 16:1-11 పవిత్ర బైబిల్ (TERV)
దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము. “యెహోవా, నీవు నా యజమానివి నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది” అని నేను యెహోవాతో చెప్పాను. మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు, “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.” కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది. ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను. ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను. నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది. యెహోవా, నీవే నన్ను బలపరచావు. యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము. నా వంతు చాలా అద్భుతమయింది. నా స్వాస్థ్యము చాలా అందమయింది. యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను. రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను. ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు. నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను. కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి. నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది. ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక. నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు. సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు. యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది. నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
కీర్తనలు 16:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. –నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును నేనీలాగందును–భూమిమీదనున్న భక్తులే శ్రేష్ఠులు;వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపు చున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచి పెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
కీర్తనలు 16:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి. యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను. భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.” వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి. వారి రక్తార్పణలలో నేను పాల్గొనను నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను. యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు. మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి; ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది. నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను, రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది. ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను. కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది. ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు. మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.