కీర్తనలు 148:1-6
కీర్తనలు 148:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి. ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి. సూర్యడా, చంద్రుడా, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల్లారా మీరంతా ఆయనను స్తుతించండి. అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి. అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి. ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.
కీర్తనలు 148:1-6 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను స్తుతించండి! పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి! సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! ఆయన సర్వ సైనికులారా, ఆయనను స్తుతించండి! సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి. ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి! మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి. ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది. ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు. ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
కీర్తనలు 148:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
కీర్తనలు 148:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి. యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి. అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి, ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు, ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.