కీర్తనలు 144:1-15

కీర్తనలు 144:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి. నా చేతులకు, వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే. నీవే నా నిబంధన విశ్వసనీయుడివి, నా దుర్గానివి. ఆయనే నన్ను కాపాడే ఎత్తయిన నా గోపురం. నేను దాగి ఉండే నా డాలు ఆయనే. ఆయన పైనే నేను ఆధారపడతాను. జాతులు నాకు లోబడేలా అణిచేవాడు యెహోవానే. యెహోవా, నువ్వు మనుషులను లక్ష్యపెట్టడానికి వాళ్ళు ఎంతటి వాళ్ళు? వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి? మనిషి కేవలం శ్వాస వంటివాడు. వాళ్ళ రోజులు కదిలిపోతున్న నీడలాగా ఉన్నాయి. యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి. మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు. ఆకాశం నుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను. రాజులకు విజయం ఇచ్చేది నువ్వే. దుర్మార్గుల కత్తివేటు నుండి నీ సేవకుడైన దావీదును తప్పించే వాడివి నువ్వే. విదేశీయుల చేతుల్లోనుంచి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. యవ్వనంలో ఉన్న మా కొడుకులు మొక్కల్లాగా ఏపుగా ఎదగాలి. మా కూతుళ్ళు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లాగా ఉండాలి. మా గోదాముల్లో రకరకాల ధాన్య నిధులు నిండాలి. మా పచ్చిక మైదానాల్లో మా గొర్రెలు వేలు, పదివేలు పిల్లలు పెట్టాలి. అప్పుడు మా పశువులు ఎన్నో దూడలు ఈనతాయి. అవేవీ మా కంచెలు విరగ్గొట్టుకుని పరుగులెత్తకుండా ఉండాలి. మా వీధుల్లో ఎలాటి గలాటా ఉండకూడదు. ఇలాంటి దీవెనలు గల ప్రజలు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో వాళ్ళు ధన్యజీవులు.

షేర్ చేయి
Read కీర్తనలు 144

కీర్తనలు 144:1-15 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా నా దుర్గం. యెహోవాను స్తుతించండి. యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు. యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం. యెహోవా నన్ను రక్షిస్తాడు, యెహోవా నా కేడెం. నేను ఆయనను నమ్ముతాను. నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం? నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు? మనిషి జీవితం గాలి బుడగలాంటిది. వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది. యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము. పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది. యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము. నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము. యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము. ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము. ఇతరుల నుండి నన్ను రక్షించుము. ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్య విషయాలు చెబుతారు. యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము. పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను. రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు. యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు. ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము. ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్యాలు చెబుతారు. మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు. మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను. మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను. శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను. మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను. మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను. ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు. యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.

షేర్ చేయి
Read కీర్తనలు 144

కీర్తనలు 144:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింప బడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారువారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది. దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్ను విడి పింపుమువారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది. మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట యైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.

షేర్ చేయి
Read కీర్తనలు 144

కీర్తనలు 144:1-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు. ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము. యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు? నరులు కేవలం ఊపిరిలాంటివారు; దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి. యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి. మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి. పైనుండి మీ చేయి చాపండి; గొప్ప జలాల నుండి, విదేశీయుల చేతుల్లో నుండి, నన్ను విడిపించండి. వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను. రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి నన్ను విడిపించండి; విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా, తమ యవ్వన దశలో ఉంటారు. మా కుమార్తెలు, రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు. మా కొట్లు అన్ని రకాల ధాన్యాలతో నిండి ఉంటాయి. మా పచ్చికబయళ్లలో గొర్రెల మందలు వేలల్లో, పది వేలల్లో విస్తరిస్తాయి. మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి. గోడలు నాశనం కాకూడదు. చెరలోనికి వెళ్లకూడదు దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు. ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు.

షేర్ చేయి
Read కీర్తనలు 144