కీర్తనలు 142:3-6
కీర్తనలు 142:3-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు. చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు. యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను; “నా ఆశ్రయం మీరే, సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను. నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.
కీర్తనలు 142:3-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు. నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు. యెహోవా, నేను నీకే మొరపెడుతున్నాను. నన్ను ఆదుకునేది నువ్వే. సజీవులు నివసించే భూమి మీద నా భాగం నువ్వే అంటున్నాను. నా ఆక్రందన ఆలకించు. నేను క్రుంగిపోయి ఉన్నాను. నన్ను తరుముతున్నవాళ్ళు నాకంటే బలవంతులు. వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
కీర్తనలు 142:3-6 పవిత్ర బైబిల్ (TERV)
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు. నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు. కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు. యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
కీర్తనలు 142:3-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని. నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము.