కీర్తనలు 142:1-4
కీర్తనలు 142:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను. ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకు మనవి చేసుకుంటున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు. నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.
కీర్తనలు 142:1-4 పవిత్ర బైబిల్ (TERV)
సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను. యెహోవాను నేను ప్రార్థిస్తాను. నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు. నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కీర్తనలు 142:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొను చున్నాను. నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.
కీర్తనలు 142:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను. ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను; నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను. నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు. చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు.