కీర్తనలు 139:1-24
కీర్తనలు 139:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు. నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు. నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు. యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు. ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు. నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను? ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను. అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది. నేనిలా అనుకుంటాను, చీకటి నన్ను దాచిపెడుతుంది. నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిలాగా అవుతుంది. అప్పుడు చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగుగా ఉంటుంది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకే విధంగా ఉన్నాయి. దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు. నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే. నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి. దేవా, నీ ఆలోచనలు నాకెంతో ప్రశస్తమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కపెడదామనుకుంటే అవి ఇసక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే ఉన్నాను. దేవా, దుష్టులను నువ్వు కచ్చితంగా హతమారుస్తావు. హింసించే వాళ్ళంతా నా దగ్గర నుండి వెళ్ళిపొండి. వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు. యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళను నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళను నేను అసహ్యించుకుంటున్నాను గదా. వాళ్ళ మీద నాకు తీవ్రమైన ద్వేషం ఉంది. వాళ్ళు నాకు శత్రువులు. దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో. నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.
కీర్తనలు 139:1-24 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను గూర్చి నీకు అంతా తెలుసు. నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు. యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. నేను చేసే ప్రతీది నీకు తెలుసు. యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు. యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు. నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. గ్రహించటం నాకు కష్టతరం. నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను. నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు. యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు. అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, ఆ చేతితో నన్ను నడిపిస్తావు. యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే, “పగలు రాత్రిగా మారిపోయింది. తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది. యెహోవా, నా శరీరమంతటినీ నీవు చేశావు. నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు. యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు. నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి, నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు. యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు. దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం. నీకు ఎంతో తెలుసు. వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను. దేవా, దుర్మార్గులను చంపివేయుము. ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము. ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు. యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను. నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను. నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! నీ శత్రువులు నాకూ శత్రువులే. యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము. చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
కీర్తనలు 139:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును –అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనినయెడల చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా! వారియందు నాకు పూర్ణద్వేషము కలదువారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
కీర్తనలు 139:1-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు. నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు. నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు. యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, అదేమిటో మీకు పూర్తిగా తెలుసు. నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు. అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు; నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు. ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి, నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే, అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది, మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది. “చీకటి నన్ను దాచివేస్తుంది, నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే, చీకటి కూడ మీకు చీకటి కాదు; రాత్రి పగటివలె మెరుస్తుంది, ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది. నా అంతరంగాన్ని మీరు సృష్టించారు; నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు. నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి, అది నాకు పూర్తిగా తెలుసు. రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు, భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు, నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు. నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి; నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దేవా, మీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి! వాటి మొత్తం ఎంత విస్తారమైనది! వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే, అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి, నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను. ఓ దేవా, మీరే దుష్టులను హతం చేస్తే మంచిది; హంతకులారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి. వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు. యెహోవా, మిమ్మల్ని ద్వేషించేవారిని నేను ద్వేషించనా, మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని అసహ్యించుకోనా? వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు; వారిని నా శత్రువులుగా లెక్కగడతాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి; నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి. చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.