కీర్తనలు 139:1-10
కీర్తనలు 139:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
కీర్తనలు 139:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు. నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు. నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు. యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు. ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు. నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను? ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను. అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.
కీర్తనలు 139:1-10 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను గూర్చి నీకు అంతా తెలుసు. నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు. యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. నేను చేసే ప్రతీది నీకు తెలుసు. యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు. యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు. నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. గ్రహించటం నాకు కష్టతరం. నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను. నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు. యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు. అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
కీర్తనలు 139:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు. నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు. నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు. యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, అదేమిటో మీకు పూర్తిగా తెలుసు. నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు. అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు; నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు. ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి, నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే, అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది, మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది.