కీర్తనలు 138:1-8
కీర్తనలు 138:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను. నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు. నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు. యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు. యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు. యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు. నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి నా శత్రువుల క్రోధం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడిచేతి నుండి నాకు సంరక్షణ దొరుకుతుంది. యెహోవా నా తరపున పని సవ్యంగా జరిగిస్తాడు. యెహోవా, నీ కృప సదాకాలం నిలుస్తుంది. నీ చేతులు చేసిన వాటిని విడిచిపెట్టవద్దు.
కీర్తనలు 138:1-8 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను. దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు. దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు. యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక! నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు. ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను. యెహోవా మహిమ గొప్పది. దేవుడు గొప్పవాడు. అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు. గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు. కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు. దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము. యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
కీర్తనలు 138:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారముచేయు చున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను. నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలువిని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. –యెహోవా మహా ప్రభావముగలవాడనివారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె దరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.
కీర్తనలు 138:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను. మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ, మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలను మీరు అధికంగా ఘనపరిచారు. నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు. యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. యెహోవా మహిమ గొప్పది కాబట్టి, వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక. యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు. నేను కష్టంలో చిక్కుకున్నా మీరు నా జీవితాన్ని కాపాడండి. నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు. యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు; యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది, మీ చేతిపనిని వదిలిపెట్టకండి.