కీర్తనలు 119:73-176

కీర్తనలు 119:73-176 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువువారి కపటాలోచన మోసమే. భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము. మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక. నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:73-176 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి; మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి. మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక, ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను. యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు. మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది. నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి, మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము. కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను. మీకు భయపడేవారు, మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక. నేను అవమానానికి గురి కాకుండ, మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను. మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది; కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను. మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను. నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా, నేను మీ శాసనాలను మరువను. మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు? అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు. మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి. వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు, అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు. మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి, తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను. యెహోవా! మీ వాక్కు శాశ్వతం; అది పరలోకంలో సుస్థిరంగా ఉంది. మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది. మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది. మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి, ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి. ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే, నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని. నేను మీ కట్టడలు ఎన్నడు మరువను, ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు. నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను. దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను. సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము. ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను. మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి. నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను. నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను. మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను. నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు. మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి! మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము. మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను. యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి. నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను. దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు. మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; అవి నా హృదయానికి ఆనందం. అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను. ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం. మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను. మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు, వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి. భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను. మీ భయానికి నా శరీరం వణకుతుంది; మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి. మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి; అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి. మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం, మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి అలాగే మీ శాసనాలు నాకు బోధించండి. నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది; యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే. ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను, నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము. మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను. మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది. మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను. మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి. మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక. నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది. యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి. యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను. నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి. మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, మీ ఆజ్ఞలన్నీ నిజం. మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను. నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు. నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు. యెహోవా, మీ కనికరం గొప్పది; మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి. నన్ను హింసించే శత్రువులు చాలామంది, అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు. నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి. మీ వాక్కులన్నీ నిజం; మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి. కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు, అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది. ఒకడు దోపుడుసొమ్మును చూసి సంతోషించినట్లు నేను మీ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను. అబద్ధం అంటే నాకు అసహ్యం ద్వేషం కాని మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి. మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప సమాధానం కలిగి ఉంటారు, ఏదీ వారిని తొట్రిల్లేలా చేయలేదు. యెహోవా! మీ రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను, నేను మీ ఆజ్ఞలను అనుసరిస్తాను. నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను. నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు. యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి. నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి. నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక, ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు. నా నాలుక మీ మాటను పాడును గాక, ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి. మీ చేయి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండును గాక, ఎందుకంటే నేను మీ కట్టడలను ఎంచుకున్నాను. యెహోవా, నేను మీ రక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను, మీ ధర్మశాస్త్రం నాకెంతో ఆనందాన్నిస్తుంది. నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి, మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి. నేను తప్పిపోయిన గొర్రెలా తిరుగుతున్నాను. మీ సేవకుడిని వెదకండి, నేను మీ ఆజ్ఞలను మరవలేదు.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:73-176 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి. నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు. నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక. నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక. నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక. నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక. నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను. నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి. నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు. నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు? నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి. భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు. నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు. యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది. నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది. అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి. నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు. నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు. నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను. సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి. నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది. నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది. నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను. నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను. నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి. నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి. నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు. నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను. యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను. నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు. నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను. నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం. రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి. నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక. నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే. భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం. నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు. మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక. నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి. నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు. నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం. బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి. నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం. నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను. నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి. నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను. నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు. నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు. నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు. నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు. ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను. యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం. నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు. నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది. నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది. నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను. నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు. నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు. తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు. దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు. యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు. నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది. యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు. నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను. ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు. నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి. అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది. పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం. నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి. నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు. నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి. నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది. నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక. యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:73-176 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు. నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు. నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం. యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు. నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే. ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము. యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము. నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను. నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు. యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను. నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము. అందుచేత నేను అవమానించబడను. నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను. కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను. నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి. యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు? నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు. నేను ఎంత కాలం జీవిస్తాను? యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు. మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం. యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు. అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము! ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు. నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు. యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము. నీవు చెప్పే వాటిని నేను చేస్తాను. యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది. నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు. యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది. నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి. యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి. నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే, నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను. యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను. దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది. నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికీ ఒక హద్దు ఉంది. నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో! దినమంతా అదే నా ధ్యానం. నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే జ్ఞానవంతునిగా చేస్తుంది. నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది. ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి. ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను. కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను. నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను. యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను. నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం. నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి, అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము. యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి. నీ న్యాయ చట్టాలు మంచివి. నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము! యెహోవా, నా స్తుతి అంగీకరించు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది. కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు. యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను. అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది. నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను. స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం. నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను. నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను. యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము. నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము. నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు. యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను. నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను. యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు. ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు. యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు. కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. యెహోవా, నీవంటే నాకు భయం, నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను. యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను. నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు. నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము. యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు. కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి. నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం. ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు. యెహోవా, నీ ఆజ్ఞలు మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం. నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను. తప్పుడు బోధలు నాకు అసహ్యం. యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం, అందుకే నేను దానిని అనుసరిస్తాను. ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది. నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది. యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను. నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను. దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము. నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము. నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు. యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను. యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ. నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు. కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను. యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను. నీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను. నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము. మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు. యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను. యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు. యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము. దుష్టులు జయించరు. ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు. యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు. ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము. యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది. ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు. కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను. యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో, నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది. అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం. నీ మంచి న్యాయ చట్టాలను బట్టి నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను. నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది. ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను. నేను నీ ఒడంబడికను అనుసరించాను. యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ. నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను. యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు. యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము. యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము. నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను. నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము. నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి. నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను. కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి. యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము. నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను. యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము. నేను నీ సేవకుడను. మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:73-176 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీచేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము. నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకువారు సిగ్గుపడుదురు గాక. నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను –నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు? నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి. నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువువారి కపటాలోచన మోసమే. భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము. మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక. నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము. నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదువారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచితిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

షేర్ చేయి
Read కీర్తనలు 119

కీర్తనలు 119:73-176 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)