కీర్తనలు 119:137-160
కీర్తనలు 119:137-160 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం. నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు. నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది. నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది. నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను. నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు. నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు. తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు. దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు. యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు. నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది. యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు. నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను. ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు. నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.
కీర్తనలు 119:137-160 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ. నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు. కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను. యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను. నీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను. నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము. మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు. యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను. యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు. యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము. దుష్టులు జయించరు. ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు. యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు. ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము. యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.
కీర్తనలు 119:137-160 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పెట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును. నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము. నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
కీర్తనలు 119:137-160 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి. యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను. నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి. మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, మీ ఆజ్ఞలన్నీ నిజం. మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను. నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు. నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు. యెహోవా, మీ కనికరం గొప్పది; మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి. నన్ను హింసించే శత్రువులు చాలామంది, అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు. నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి. మీ వాక్కులన్నీ నిజం; మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి.