కీర్తనలు 119:105-112
కీర్తనలు 119:105-112 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు. నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను. యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను. నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు. నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను. నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.
కీర్తనలు 119:105-112 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి. నీ న్యాయ చట్టాలు మంచివి. నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము! యెహోవా, నా స్తుతి అంగీకరించు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది. కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు. యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను. అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది. నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
కీర్తనలు 119:105-112 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
కీర్తనలు 119:105-112 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను. యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి. నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను. దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు. మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; అవి నా హృదయానికి ఆనందం. అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.