కీర్తనలు 119:1-24
కీర్తనలు 119:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు. ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు. వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు. మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు. ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది! నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు. నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా? నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను. యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు. నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను. సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను. నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను. నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు. నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు. అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది. గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు. నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు. పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు. నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు.
కీర్తనలు 119:1-24 పవిత్ర బైబిల్ (TERV)
పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు. యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు. ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు. యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు. ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను, అప్పుడు నేను నీ ఆజ్ఞలను ఎప్పుడు చదివినా సిగ్గుపడను. అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము! యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే. నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను. దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము. నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను యెహోవా, నీకే స్తుతి. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను. ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను. నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను. యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను. ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను. యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు. ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి. నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు. నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు. నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను. నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు. అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను. నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది.
కీర్తనలు 119:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము. అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాట లాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.
కీర్తనలు 119:1-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నిందారహిత మార్గాలను అనుసరిస్తూ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు, వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు. అత్యంత జాగ్రత్తగా పాటించాలని మీరు వారికి శాసనాలిచ్చారు. మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను. నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను. నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి. నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; మీ శాసనాలను నాకు బోధించండి. మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను. ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, మీ సేవకునిపట్ల దయగా ఉండండి. మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి. ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది. శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు. నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి. పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు. మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి.