కీర్తనలు 111:1-10
కీర్తనలు 111:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు. ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు. ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి. అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి. ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం. యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.
కీర్తనలు 111:1-10 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను స్తుతించండి! మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను. యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి. దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము. దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు. దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి. దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా. ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి. దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి. ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి. దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు. దేవుని నామం అద్భుతం, పవిత్రం! దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది. దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు. శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
కీర్తనలు 111:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించియున్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడిచేసి యున్నాడు. ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
కీర్తనలు 111:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను. యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు. ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది. మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; యెహోవా దయామయుడు. కనికరం గలవారు. భయభక్తులు గలవారిని పోషిస్తారు. ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి, తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు. ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి; ఆయన కట్టడలు నమ్మదగినవి. అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి, నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి. ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు; ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు, ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.