కీర్తనలు 103:1-13
కీర్తనలు 103:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు. ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు. నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు. నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు. యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు. ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు. యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది. ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు. మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు. భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు. తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
కీర్తనలు 103:1-13 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము. నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము. మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు. మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు. దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు. దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు. ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు. యెహోవా న్యాయం కలవాడు. ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు. దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు. తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు. యెహోవా జాలిగలవాడు, దయగలవాడు. దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు. యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు. యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు. మనం దేవునికి విరోధంగా పాపం చేశాం. కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు. భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది. పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు. తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
కీర్తనలు 103:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడువారికందరికి న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచియున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
కీర్తనలు 103:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు. ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు. నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు, నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా, మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు. అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు. ఆయన మోషేకు తన మార్గాలను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు. యెహోవా కృపా కనికరం గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు. ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు, శాశ్వతంగా కోపం పెట్టుకోరు; మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు. భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం. పడమటికి తూర్పు ఎంత దూరమో, అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు. తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు