కీర్తనలు 101:1-5
కీర్తనలు 101:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను. నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను. నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను. కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను.
కీర్తనలు 101:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నేను నిన్ను కీర్తిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, న్యాయాలను గూర్చి గానం చేస్తాను. ఎలాంటి దోషమూ లేకుండా వివేకంతో నడుచుకుంటాను. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను నా ఇల్లంతటిలో యథార్థమైన ప్రవర్తనతో నడుచుకుంటాను. వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను. మూర్ఖంగా ఆలోచించేవాడు నాకు దూరంగా ఉండాలి. దుష్టకార్యాలంటే నాకు అసహ్యం. తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.
కీర్తనలు 101:1-5 పవిత్ర బైబిల్ (TERV)
ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నేను నీకు భజన చేస్తాను. నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు? నా యెదుట ఏ విగ్రహాలు ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను! నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు పనులు చేయను. ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ అతిశయించడం నేను జరుగనివ్వను.
కీర్తనలు 101:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొం దును నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య ములు అవి నాకు అంటనియ్యను మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను. తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను