కీర్తనలు 1:1-6
కీర్తనలు 1:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు. అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు. దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు. కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.
కీర్తనలు 1:1-6 పవిత్ర బైబిల్ (TERV)
ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే, అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు, అతడు పాపులవలె జీవించనప్పుడు, దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు. ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు. ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు. కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు. సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు. అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు. అతడు చేసేది అంతా సఫలం అవుతుంది. అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు. వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు. ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు. ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు. ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు, చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
కీర్తనలు 1:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
కీర్తనలు 1:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు. వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు. అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు. కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.