కీర్తనలు 1:1-3
కీర్తనలు 1:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు. అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.
కీర్తనలు 1:1-3 పవిత్ర బైబిల్ (TERV)
ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే, అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు, అతడు పాపులవలె జీవించనప్పుడు, దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు. ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు. ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు. కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు. సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు. అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు. అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
కీర్తనలు 1:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తనలు 1:1-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు. వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.