సామెతలు 8:1-36

సామెతలు 8:1-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది. రహదారుల్లో, ప్రధాన వీధుల్లో, పట్టణ దారులు కలిసే కూడలిలో అది నిలబడి ఉంది. నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది. “మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను. జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి. వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి. నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం. న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు. నా మాటలన్నీ వివేకం గలవాడికి తేటగా అర్థం అవుతాయి. తెలివి గలవాడు న్యాయం గ్రహిస్తాడు. వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి. విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు. నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను. దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం. అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే. నా మూలంగా రాజులు పరిపాలిస్తారు. అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు. నా మూలంగా ఘనత వహించిన న్యాయాధిపతులంతా న్యాయం జరిగిస్తారు. లోకంలోని అధికారులు పాలన సాగిస్తారు. నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు. ఐశ్వర్యం, ప్రతిష్ఠ, నీతి న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి. నా వల్ల కలిగే ఫలం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది. నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి. నన్ను ప్రేమించే వాళ్ళను నేను సంపన్నులుగా చేస్తాను. వారికి ధన సమృద్ధి కలిగిస్తాను. గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు. అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు. ప్రవాహించే నదులు లేనప్పుడు, నీటి ఊటలు ఇంకా పుట్టనప్పుడు నేను రూపుదిద్దుకున్నాను. పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను. ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను. ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను. భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను. నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను. ఆయన సృష్టించిన లోకాన్నిబట్టి, భూమిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. భూమిపై ఉన్న మానవ జాతిని చూసి ఆనందిస్తున్నాను. కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు. నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి. నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. నన్ను తృణీకరించేవాడు తనకు తానే హాని కలిగించుకుంటాడు. నన్ను అసహ్యించుకొనే వాళ్ళు మరణానికి స్నేహితులౌతారు.”

షేర్ చేయి
Read సామెతలు 8

సామెతలు 8:1-36 పవిత్ర బైబిల్ (TERV)

జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది. మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి. పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి. తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి. జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా. మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి. అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి. వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను. నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం. నేను చెప్పే విషయాలు సరైనవి. నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు. తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి. తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు. నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది. ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది. జ్ఞానము ముత్యాలకంటె విలువగలది. ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది. “నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో జీవిస్తాను. తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు. ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను. చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం. కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను! రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు. నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు. నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి. నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను. “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట యెహోవాచేత చేయబడింది నేనే నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను. నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను. నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను. యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు. అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు. “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. వినుటకు తిరస్కరించకుడి. ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు. నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును. అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి తనకు తానే హాని చేసుకొంటాడు. నన్ను అసహ్యించుకొనువారు మరణమును ప్రేమించెదరు.”

షేర్ చేయి
Read సామెతలు 8

సామెతలు 8:1-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది – మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు. నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి. మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడిదొడ్డది. నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదునువారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.

షేర్ చేయి
Read సామెతలు 8

సామెతలు 8:1-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా? కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది; పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది: మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను. అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి. వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి. నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు. నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి. వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి. జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు. “నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము. ఆలోచన చెప్పడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం నా పని; నేను అంతరార్థం కలిగి ఉన్నాను, పరాక్రమం నాదే. నా వలననే రాజులు రాజ్యాలను పరిపాలిస్తారు; పాలకులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు. నా వలననే రాజకుమారులు ఏలుతారు, నీతిగల అధిపతులు భూమిమీద ప్రభుత్వం చేస్తారు. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను. ఐశ్వర్యం, గౌరవం, స్ధిరమైన ఆస్తి, నీతి నా దగ్గర ఉన్నాయి. మేలిమి బంగారముకంటెను నా వలన కలిగే ఫలం మంచిది; శ్రేష్ఠమైన వెండికంటెను నా వలన కలిగే లాభం గొప్పది. నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించేవారిని కలిమికి కర్తలుగా చేస్తాను వారి ధనాగారాన్ని సమృద్ధితో నింపుతాను. “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు; మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను. ప్రవహించే కాలువలు లేనప్పుడు నీళ్లతో నిండి ఉన్న నీటి ఊటలు లేనప్పుడు నేను పుట్టాను. పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని. దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని. దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు నీటి ధారలను ఆయన చేసినప్పుడు, నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు. నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, ప్రతిరోజు సంతోషిస్తూ, ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను, దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు. నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; దానిని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా వాకిటి దగ్గర కాచుకుని నా బోధను వినే మనుష్యులు ధన్యులు. నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకుంటాడు; నేనంటే అసహ్యపడేవాడు మరణాన్ని ప్రేమించినవాడు.”

షేర్ చేయి
Read సామెతలు 8