సామెతలు 7:6-23
సామెతలు 7:6-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను. బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను. అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు, దాని ఇంటి వైపే నడుస్తున్నాడు అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి. అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో, ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది. (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది, దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు; అది వీధుల్లో తిరుగుతుంది, ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.) అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది: “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు! నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన రంగుల నార దుప్పట్లు పరిచాను. నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం! నా భర్త ఇంట్లో లేడు; దూర ప్రయాణం వెళ్లాడు. అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. రెండు వారాల వరకు తిరిగి రాడు.” ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి. అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు, తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.
సామెతలు 7:6-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను. జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు. సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు. ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు. అప్పుడు వేశ్య వేషం ధరించిన ఒక కుటిల బుద్ధిగల స్త్రీ అతనికి ఎదురు వచ్చింది. ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు. ఆమె ఒక్కోసారి తన ఇంటి ఎదుట, ఒక్కోసారి పట్టణ వీధుల్లో ఉంటుంది. ప్రతి సందులోనూ ఆమె కాపు కాసి ఉంటుంది. ఆమె ఆ యువకుణ్ణి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. సిగ్గు, బిడియం లేని ముఖంతో అతనితో ఇలా చెప్పింది, “నేను శాంతి బలులు చెల్లించవలసి ఉంది. ఇప్పుడే నా మొక్కుబడులు చెల్లించాను. నిన్ను కలుసుకోవాలని, నీకు ఎదురు రావాలని బయలుదేరాను. నువ్వే నాకు కనబడ్డావు. నా మంచంపై రత్న కంబళ్ళు పరిచాను. ఐగుప్తు నుండి తెప్పించిన నైపుణ్యంగా అల్లిన నార దుప్పట్లు వేశాను. నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను. బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం. నా భర్త ఇంట్లో లేడు. ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు. అతడు డబ్బు సంచి తనతో తీసుకు వెళ్ళాడు. పున్నమి రోజు వరకూ ఇంటికి తిరిగి రాడు.” ఆ విధంగా ఆమె తన మృదువైన మాటలు పదే పదే చెబుతూ, లాలిస్తూ అతణ్ణి లోబరచుకుంది. పొగడ్తలతో ముంచెత్తుతూ అతణ్ణి ఈడ్చుకు పోయింది. వెంటనే అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధకై వెళ్లినట్టు, పరాయివాళ్ళ చేతికి చిక్కి చెరసాల పాలైనట్టు అతడు వెళ్ళాడు. పక్షి తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలియక ఉచ్చులో పడినట్టు, అతని గుండెను చీల్చే బాణం దూసుకుపోయేంత వరకూ అతడు ఆమె వెంటబడి వెళ్ళాడు.
సామెతలు 7:6-23 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను. నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను చూసాను. ఒక చెడ్డ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు నడిచాడు. ఆ యువకుడు ఆ స్త్రీ ఇంటిమూలకు నడిచాడు. సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది. ఆ స్త్రీ అతనిని కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది. పాపం గూర్చి ఆమె లెక్కచేయలేదు. మంచి చెడును గూర్చి ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటివద్ద ఎన్నడూ నిలిచి వుండదు. కాని ఆమె వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని చూస్తూ ఆమె అన్ని మూలలకూ వెళ్తుంది. ఆమె ఆ యువకుడ్ని గట్టిగా పట్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గులేకుండా ఆమె ఇలా చెప్పింది: “ఈవేళ నేను సాంగత్య బలి అర్పించాలి. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా ఇచ్చేశాను. (ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి ఉంది). అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని ఆహ్వానించటానికి నేనిలా బయటకు వచ్చాను. నేను నీకోసం ఎంతో ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కనబడ్డావు! నా మంచం మీద శుభ్రమైన దుప్పట్లు నేను పరిచాను. అవి చాలా, అందమైన ఈజిప్టు దుప్పట్లు. నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు దాల్చినచెక్క ఉపయోగించాను. వచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చుకొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు. నా భర్త వెళ్లిపోయాడు. అతడు వ్యాపారం పని మీద వెళ్లిపోయాడు. దీర్ఘప్రయాణానికి సరిపడినంత ధనం అతడు తీసుకొని వెళ్లాడు. రెండు వారాల వరకు అతడు తిరిగి ఇంటికి రాడు.” ఆ యువకుని శోధించటానికి ఆ స్త్రీ ఆ మాటలు ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతణ్ణి మాయ చేశాయి. ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబడించాడు. వధకు తీసుకొనిపోబడుతున్న ఎద్దులా ఉన్నాడు అతడు. బోనులోనికి నడుస్తున్న జింకలా అతడు ఉన్నాడు. దాని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు సిద్దంగా ఉన్నట్టు ఉంది. వలలోకి ఎగురుతోన్న పక్షిలా ఉన్నాడు ఆ యువకుడు. అతడు చిక్కుకొన్న అపాయం అతనికి తెలియదు.
సామెతలు 7:6-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారిమధ్యను యౌవనులమధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. –సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను. అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను –సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. ఉదయమువరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదమురమ్ము. పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు అతడు సొమ్ముసంచి చేతపట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను– అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.