సామెతలు 4:14-19
సామెతలు 4:14-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు. అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో. ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు. వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు. ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది. దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు.
సామెతలు 4:14-19 పవిత్ర బైబిల్ (TERV)
దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు. మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది. చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు.
సామెతలు 4:14-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
సామెతలు 4:14-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో. కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు. వారు దుర్మార్గమనే ఆహారం తింటారు హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు. నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది. కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం; వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు.