సామెతలు 4:1-27
సామెతలు 4:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి. నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి. నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి. ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు “నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు. జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు. జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు. నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది. కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది. జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు. అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో. భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు. అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో. ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు. వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు. ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది. దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు. కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో. అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు. నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు. నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి. కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”
సామెతలు 4:1-27 పవిత్ర బైబిల్ (TERV)
కుమారులారా, “మీ తండ్రి ఉపదేశములు వినండి.” మీరు గ్రహించగలుగునట్లు గమనించండి. ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు. నేను నా తండ్రికి పసివాడను. నేను నా తల్లికి ఒకే కూమారుణ్ణి. నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో ఇలా చెప్పాడు: “నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీవు నా ఆజ్ఞలకు విధేయుడవైతే జీవిస్తావు. జ్ఞానము, వివేకం సంపాదించు! నా మాటలు మరువకు. నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు. జ్ఞానమునుండి తొలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది. “జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. జ్ఞానాన్ని ప్రేమించు. జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చి పెడుతుంది. ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.” కనుక నా మాట విను. నేను చెప్పే సంగతులను జరిగించు. అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు. జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం! దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో. చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు. మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది. చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు. నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. నా మాటలు నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి. నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి. సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చేప్పవద్దు. అబద్ధాలు చెప్పకు. నీ యెదుట ఉన్న జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి పోనివ్వకు. సరైన విధంగా జీవించుటకు చాలా జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు స్థిరమైన మంచిజీవితం ఉంటుంది. తిన్నని మార్గం విడిచిపెట్టకు అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపొమ్ము.
సామెతలు 4:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమారుడనైయుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను – నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము.
సామెతలు 4:1-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి. మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, కాబట్టి నా బోధను త్రోసివేయకండి. నేను కూడా నా తండ్రికి కుమారుడను, నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను. నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే, “నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో; నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు. జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో; నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు. నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది. జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో. దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది; దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది. అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.” నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు, నీవు దీర్ఘకాలం జీవిస్తావు. నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను. నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు. ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో. దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో. కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు. వారు దుర్మార్గమనే ఆహారం తింటారు హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు. నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది. కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం; వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు. నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు, నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో. వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి. నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో. నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక. నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి. నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు. నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.